Wednesday, 5 May 2021

శ్రీరామ ఎదుర్కోలు

శ్రీరామ ఎదుర్కోలు 

 1. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం | 

లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం ||

ఆదినారాయణుడు - ధర్మసంస్థాపనార్ధం ప్రతియుగంలోనూ అవతరిస్తూ - ప్రస్తుతం మారీచ - సుబాహు - ఖరదూషణ - కుంభ కర్ణ రావణాది మహారాక్షస సంహారానికై శ్రీరాముడుగా అవతరించాడు మాస్వామి. వారు అప్పుడప్పుడూ కోపం తెచ్చుకుంటుాంరు. జాలి నిష్కారణంగా కూడా వెంటనే కలుగుతూంటుంది. నిగ్రహానుగ్రహ సమర్ధుడు మాస్వామి ప్రస్తుతం వరుడు. సకల శుభలక్షణ సంపన్న అయిన అపరలక్ష్మీదేవి విం వధువుకోసం అన్వేషిస్తూ ఇలా మీ ఊరు వచ్చాం. మా కార్యం సఫలం చేస్తారేమోనని!


వధువుపక్షం

2. శ్రీరామపత్నీ జనకస్యపుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ |

 భూగర్భ జాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు ||

 చాలా సంతోషం స్వామి!  నిత్యానపాయినీ - నిరంతరమూ జీవులను రక్షించడమే తన పనిగా పెట్టుకొని స్వామి నిగ్రహానుగ్రహాలను సరిదిద్దుతూ - ప్రతి అవతారంలోనూ కూడా ఉంటూ - వాత్సల్యాది గుణభూషితురాలుగా భావించబడుతున్న మా యమ్మ సీతమ్మ ఇక్కడ ఉన్నది. యుక్తవయస్సు వచ్చింది. తగిన వరునికోసం అన్వేషణలో మేమూ ఉన్నాం. ఇవాళ మీరూ అదే పనిమీద వచ్చామన్నారు. మీకు స్వాగతాలు పలుకుతున్నాం. ఇదిగో మా అమ్మాయి చూడండి. 'ధ్రువం విశిష్టాగుణతోహి సీతా' - గుణాలచేత సీతమ్మే గొప్పది.

వరుడు 3. 

ఓహో! సీత మీ అమ్మాయి యేనా? ఈ తల్లిగారేనా జనక మహారాజుగారికి పొలం దున్నుతుంటే నాగిే చాలులో దొరికిన బంగారు భరిణె. అయోనిజకద. అంటే కులగోత్రాలు - బంధుత్వాలూ - మర్యాదలు ఏవీ నన్నమాట!

వధువు 4. 

స్వామీ! విషయం తెలియక పొరబడుతున్నారు. జాగ్రత్తసుమండీ! ఆమాటకొస్తే మీ రాముడి పుట్టుక విషయం తెలియని వారెవ్వరూ ఇక్కడలేరులెండి. సంతానంలేక అలమించిన థరధ మహారాజుగారు ఏదో పుత్రకామేష్ఠి చేస్తే - ఆయాగ భగవానుడు ఏదో దయతలచి పాయసాన్నం ఇస్తే - అది సేవిస్తే రాజుగారి భార్యలు - పాయసాన్న ప్రభావంతో జన్మించిన మీ రాముడి కులగోత్రాలు - బంధుత్వాలూ - మర్యాదలు ఏమిటట? అసలు మీ రాముడికా తండ్రి థరథుడా! యాగభగవానుడా! పాయసాన్నమా!

వరుడు 5. 

ముందే మనవి చేశాం కదండీ! మా రాముడు ఆదినారాయణుడనీ - అవతార పురుషుడనీ! దైవరహస్యాలను రచ్చకీడ్చాలనుకోవడం పొరపాటు. అయినా వియ్యం కోసం వచ్చాం కదా! కయ్యమెందుకులెండి! వినండి. మాస్వామి కులగోత్రాదులు. మాస్వామి శుభజనన కాలాదులు.

  తతశ్చ ద్వాథే మాసే చైత్రేనావమికే తిధౌ | నక్షత్రే అదితి దైవత్యే స్వోచ్చ సంస్ధేషు పంచసు   గ్రహేషు కర్కటేలగ్నే వాక్పతావిందునాసహ | ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతమ్‌ కౌసల్యా7 జనయ ద్రామం సర్వలక్షణ సంయుతమ్‌ | విష్ణోరర్ధం మహాభాగం పుత్ర మైక్ష్వాక వర్ధనమ్‌ ||

వధువు 6. 

బాగుంది - సంతోషం. మా అమ్మాయి శ్రీమహాలక్ష్మి. పాలసముద్రంలో ప్టుింది. చల్లదనాలనిచ్చే చంద్రునికి తోబుట్టువు. హిరణ్మయీ - ''హరికిం బట్టపుదేవి పున్నెముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురుతోబుట్టువు భారతీగిరి సుతుల్‌తోనాడు పూబోణి, తామరలందుండెడి ముద్దరాలు. జగముల్‌ మన్నించు నిల్లాలు భాసురతన్‌లేములు వాపు తల్లి - సిరియిచ్చున్‌ నిత్య కల్యాణముల్‌'' - కాగా ప్రస్తుతం మిధిలాధీశులైన జనక మహారాజుగారి పురాకృత శుభాధిక్యత వలన ఆయన ముద్దుల ప్టిగా - దైవకార్య సాఫల్యం కోసం సకలలోక కళ్యాణం కోసం సీతగా అవతరించింది. మాతల్లి సీత శ్రితకల్పవల్లి. మరి మీ వంశవిశేషాలు సెలవియ్యండి స్వామీ!

వరుడు 7. 

చాలా బాగుంది. మా రామచంద్ర ప్రభువు సూర్యవంశానికి చెందిన క్షత్రియ ప్రభువు. కానీ రోహిణీకార్తె ఎండాకాలం సూర్యుడిని మీరు గుర్తుకు తెచ్చుకొని నొచ్చుకోనక్కరలేదు. సూర్యవంశీయుడైనా చంద్రునిలో ఉన్న చల్లదనం - వీనిది. సుఖశీతలమైన అనుగ్రహవీక్షణాలు వీని లక్షణాలు.

  కథంచి దుపకారేణ కృతే నైకేన తుష్యతి

  సస్మరత్యపకారాణాం శతమప్యాత్మ వత్తయా ||

  బుద్ధిమాన్‌ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదః

చిన్న ఉపకారానికే పొంగిపోతాడు. కావాలని చేసే అపకారాలను అసలే స్మరించడు.

వధువు 8.

చాలా సంతోషం. మా యమ్మ సీతమ్మ విదేహిరాజపుత్రి మిధి అనే నిమి మహరాజుగారి పుత్రుడు నిర్మించిన రాజ్యం ఇది. వంశం ఇది. ఈ మిధినే జనకుడు అని పిలిచేవారు. ఆ వంశస్థురాలు గనుక ఈమె వైదేహిగా, మైథిలిగా పిలుస్తుాంం. మిధిలానగరం మా రాజధాని. జనక చక్రవర్తి ప్రభువు. శీతలమైన చూపులు మా సీతవి. ఈమె సాక్షాత్తూ లక్ష్మీదేవియే! ప్రణిపాతప్రసన్న. నమస్కార మాత్రంగా అనుగ్రహించే చల్లని తల్లి ఈమె.

 శ్లో|| పాపానాం వా శుభానాం వా | వధార్హాణాం ప్లవంగమ !

  కార్యం కరుణ మార్యేణ | నకశ్చిన్నాపరాధ్యతి ||

రామరావణయుద్ధానంతరం రాక్షస స్త్రీలను చంపబోయిన హనుమను వారించి 'అపరాధం చెయ్యని వాడెవడయ్యా లోకంలో?' అని రాక్షసులను రక్షించిన మీనాక్షి ఈమే! సరే మీ స్వామి యోగ్యతలను వివరిస్తారా స్వామీ!

వరుడు 9.

అలాగే! బుద్ధిమాన్‌! నీతిమాన్‌! వాగ్మీ! శ్రీమాన్‌! శత్రు నిబర్హణః! విపులాంసో! మహా బాహుః! కంబుగ్రీవో! మహాహనుః! మహోరస్కో! మహేష్వాసో! గూఢ జత్రుః! అరిందమః! ఆజానుబాహుః! సుశిరాః! సులలాటః! సువిక్రమః! సమస్సమవిభక్తాంగః! స్నిగ్ధవర్ణః! ప్రతాపవాన్‌! పినవక్షా! విశాలాక్షో! లక్ష్మీవాన్‌! శుభలక్షణః.....  సర్వదాభిగత స్సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్య సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనః || - ఇవీ మా వరుని శుభలక్షణాలు. మరి మీ అమ్మాయి యోగ్యతలు ఏపాివో సెలవివ్వండి.

వధువు 10

మా సీత దివ్యశోభనగాత్రి. బ్రహ్మాండ జనయిత్రి. భవ్యధాత్రి. కిసలయ మృదుపాణి. కీర మధురవాణి. పాలిత శర్వాణి. నీలవేణి - సజ్జనావనహేల - శాంతశీల - మంజులాధరబింబ - మహితదీప్తి కదంబ -

 సీతాం పద్మపలాశాక్షీం మన్మధస్య రతిం యథా - ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్ర ప్రభామివ -   పూర్ణచంద్రాననాంసు భ్రూంచారువృత్త పయోధరామ్‌.   జనకస్య కులేజాతా దేవమాయేవ నిర్మితాసర్వలక్షణ సంపన్నానారీణా ముత్తమా వధూః - ఇవీ మా అమ్మాయి రూపగుణ వైభవాలు.  మీ వరుని గుణాధిక్యత ఏదో వివరించండి. వింం. త్వరపడి సంబంధాన్ని కలుపుకోలేం కదండీ.

వరుడు 11

అయ్యా! మా రామభద్రుడి గుణాలను లెక్కపెట్టడానికి వేదాలవల్ల కాలేదు. వేదాన్ని రామాయణంగా దించి అనువదించిన, వాల్మీకులవల్ల కాలేదు. సమస్త కళ్యాణగుణాభిరాముడు. షోడశ కళ్యాణ కళానిధి మా దాశరధి - మరి మీ అమ్మాయి విషయాలో?

వధువు 12

స్వామీ! మాఅమ్మాయి సీత - సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని - సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని - (వన్దే) పద్మకరాంప్రసన్నవదనాంసౌభాగ్యదాం భాగ్యదాం | హస్తాభ్యాం అభయప్రదాం... మీకు తెలిసినవే. - మరి మీఅబ్బాయికి ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయాండీ!....

వరుడు 13

మా అబ్బాయికి ఎవరి క్రిందనో బ్రతకవలసిన పని, అవసరం లేదు.

  అధానన్త వీర్యస్య భగవతో మహా పురుషస్య శ్రీమదాదినాయణస్య -

  ఆధారశక్తి శ్రీకూర్మ వరాహ వైష్ణవానంత నాగశేష తక్షకాష్ట దిగ్గజ

  ఉపరి ప్రతిష్ఠితః - అంతేకాదు - సర్వదేవతలూ - లోకాలు వీని

  నుండే పుట్టున్నాయి. వీని వల్లనే మనుగడ సాగిస్తున్నాయి. జీవిస్తున్నాయి.


  'వేదవేద్యే పరేపుంసి జాతే థరథాత్మజే ....

  నారాయణాత్‌ రుద్రోజాయతే | నారాయణాత్‌ ఇంద్రోజాయతే |

  నారాయణాత్‌ ప్రజాపతయః ప్రజాయన్తే | నారాయణాత్‌

  ద్వాథాదిత్యాః | రుద్రవసవః | ....'

  ''అంతర్‌ బహిత్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః ...''

  మరి ఇంతి మహానుభావునికి తగినదేనా మీ అమ్మాయి అని మా అనుమానం!


వధువు 14.

మన భగవద్రామానుజులు మీ అనుమానాన్ని నివృత్తి చేశారెప్పుడో.

   తమ 'శరణాగతి' గద్యలో - ''ఓమ్‌ భగవన్నారాయణ! అభిమతాను

   రూప స్వరూప రూపగుణ విభవ ... ప్రపద్యే'' - చాలు స్వామీ!

   - మన వాల్మీకులవారే అన్నారుగా 'రామాయణం' మాత్రమే కాదు.

   'సీతాయాః చరితం మహత్‌' అని. గుణాధిక్యత మా అమ్మాయిది.

   - మా అమ్మ సీతమ్మ. ఆమె ఆమని సొగసులు - సహజ స్నిగ్ధ

   సౌందర్య రూపురేఖా విలాసాలు. వచన రచనాతీత రసరమ్యాలు

   ''ఈశానాం జగతోస్య వేంకటపతేః విష్ణోః పఠాం ప్రేయసీం ... జగన్మాతరమ్‌

   ''సర్వలక్షణ సంపన్నాం నారీణాం ఉత్తమా వధూః'' -

   - మీ అబ్బాయి ఏవో వేషాలు కూడా వేస్తుాంరు అని విన్నాం.

   ఏమేమి వేషాలు వేశాడేమి?


వరుడు 15

అంత చులకనగా అనకండి స్వామీ! మీకే ఇబ్బంది తరువాత. మా ప్రభువు అవతారపురుషుడు.  మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చవామనః - మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్‌

   స్వామిన్‌! పరశ్వథ తపోధన! రామచంద్ర ... శేషాంశ! రామ! యదునందన! కల్కిరూప!!

   మీ అమ్మాయి కూడా ప్రతి అవతారంలోనూ కధానాయిక (హీరోయిన్‌) పాత్ర ధరించిన విషయం మీరు మర్చిపోయినట్లున్నారు. నిత్యానపాయిని అని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా!

వధువు 16

ఆగండి. ఆగండి స్వామీ! ఆ మాటకే వస్తే, మా అమ్మాయిని అడ్డంపెట్టుకునే కదా మీ అబ్బాయి పబ్బం గడుపుకున్నది!

 శ్లో|| రాఘవత్యే7భవత్సీతా! రుక్మిణీ కృష్ణజన్మని | 

అన్యేషుచ అవతారేషు విష్ణోరేషాన పాయినీ ||

  మన స్వామి రాముడు. మన తల్లి సీత. మన విష్ణుడు కృష్ణుడు. మన మాత రుక్మిణి.  మన వెన్నుడు చెన్నుడు. మన అమ్మ రాజ్యలక్ష్మి. మన తండ్రి వేంకటేశ్వరుడు - మన తల్లి అలర్‌మేల్‌మంగ - అనుకుంటే బాగుంటుందిగానీ, అయినా - మాయమ్మ సత్యభామ కొంగుచాటున ఉండి కదా మీ స్వామి నరకాసురుడి నరికి పారేసింది? అదీ ఒక ప్రతిభేనా - భార్యచాటు భర్త గొప్పతనం ఇదే. సరే మంచిది! మీ అబ్బాయికి చదువు సంధ్యలు ఏమైనా వుంటే వివరించండి స్వామీ!

వరుడు 17

'చక్రహస్తుని ప్రకించు చదువు చదువు' అని మన ప్రహ్లాదులవారు శాసించారే - ఆ చక్రహస్తుడే కదా ఈనాి ధనుష్పాణి రాముడు.

  'సర్వశాస్త్రార్థః తత్త్వజ్ఞః స్మృతిమాన్‌ ప్రతిభానవాన్‌ | 

వేదవేదాంగ తత్వజ్ఞః, ధనుర్వేదేచ నిష్ఠితః' ||


వధువు 18

 'లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం ... వందే ముకుంద ప్రియామ్‌.

  హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత ప్రజామ్‌ ...

  చంద్రాం హిరణ్మయీం  లక్ష్మీం - జాతవేదోమమావహ | అని ఎన్నో విధాల వేదమే మా అమ్మాయిని కీర్తించింది.


వరుడు 19

 మన ఉడయవర్లు స్వామిని ఆయన సౌశీల్యాది శుభగుణ సంపదను చక్కగా అనుభవించిన మహా భాగవోత్తములు. వారి మాటలలోనే : మా స్వామి : వీర్యశక్తితేజః సౌశీల్యవాత్సల్యాది గుణగరిష్ఠుడు. స్వాభావికానవధి కాతిశయ జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజస్సాశీల్య వాత్సల్య మార్ద వార్జవ సౌహార్ద సౌమ్యకారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమడు. సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞతాది అసంఖ్యేయ కళ్యాణగుణ గణౌఘ మహార్ణవుడు మా రామచంద్రుడు.

   మోహించబోయి ముక్కూ చెవులూ కోయించుకున్న శూర్ఫణఖమ్మ మా స్వామి ఆనవాలును ఇలా చెప్పినవైనం మీకు తెలిసిందే కదండీ!

 శ్లో|| తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ!

 శ్లో|| రామః కమల పత్రాక్షః సర్వ సత్త్వమనోహరః ||

   అలాగే మా స్వామి సమస్త కల్యాణగుణాభిరాముడు. వానికి తగిన కన్యకోసమే మా అన్వేషణ అంతా! మరి మీ అమ్మాయి విషయాలు సెలవివ్వండి.


వధువు 20

 అలాగే! మా అమ్మ కడగిం చూపు ...................

 మహదైశ్వర్యాలను కాక్షించాయి. సర్వాంగ సుందరాంగి. సకల

 సౌభాగ్యదాయిని. మీ స్వాములవారి యోగ్యతలన్నీ ఈమె వలన

 సంక్రమించినవేనని ఏనాడో మన 'పదకవితాపితామహులు' - అన్నమాచార్యుల వారు తేల్చిపారేశారులెండి!

  ఏమని పొగడుదమే యిక నిన్ను ఆమని సొబగుల అలమేల్మంగ ||

  తెలిగన్నుల నీ తేటలే కద వే! వెలయగ విభునికి వెన్నెలలు

  పులకలమొలకల పొదులివి గదవే! పలుమరు పువ్వుల పానుపులు ... అంతేకాదు -

  - నిజంగా ఇప్పుడు అన్నిపిస్తున్నది. వీరిరువురి సౌందర్య సౌశీల్యాదులూ

  ఎవరికీ ఎవరూ తీసిపోరు కదా అని. మీ స్వామి ఆపాతమధురడట కదా!


వరుడు 21

నిజము నిజము స్వామీ! మా స్వామి

  అధరం మధురం | వదనం మధురం | నయనం మధురం |

  హసితం మధురం | హృదయం మధురం | గమనం మధురం |

  గీతం మధురం | సీతం మధురం | భుక్తం మధురం |

  సుప్తం మధురం | రూపం మధురం | తిలకం మధురం |

  మధురాధిపతేః అఖిలం మధురం ||

  ఆపాత మధురుడైన మా స్వామికి మధుర మఙ్గళ దేవత ఎక్కడున్నదా - అనే కదా మా శోధన అంతా!


వధువు 22

మా సీతామాత జగన్మాత. భూజాత. మంగళాభిముఖి.

  విశాలాక్షీ. మీ స్వామికి ఈమె పలుకులంటే పంచదార చిలకలు.

  'మధురా మధురాలాపా కిమాహ మమభామిని

  మద్విహీనా వరారోహా హనుమాన్‌ కధ యస్వమే || అని

  - అడిగి అడిగి హనుమన్నను 'మధురమైన నా సీత మధురాతి మధురంగా

  ఇంకా ఏమేమి చెప్పిందో చెప్పమన్న' దొరగారు కదా మీ ప్రభువుగారు!

  - ఉభయులూ 'తుల్యశీలవయోవృత్తాం తుల్యాభి జనలక్షణాం |

  రాఘవోర్హతి వైదేహీం తం చేయ మసితేక్షణాం ||

  అన్న హనుమ తీర్పు మనకు శిరోధార్యం కానివ్వండి. స్వామీ!


వరుడు 23

మా స్వామి శ్రీకృష్ణావతారంలో లీలామానుష విగ్రహుడు. పుంసాం మోహనరూపుడు.

  శతకోి మన్మధాకారుడు. అయినా అనాది బ్రహ్మచారి.

  వ్యసన కర్శకుడు. ప్రాకృత భావంతో భావిస్తే పొరబాటు

  పడతారేమోనని ముందుగా సూచిస్తున్నాము.

  మా స్వామీ శృంగారనాయకుడే. ఇందులోనూ అందెవేసిన చేయే వారిది.

  అన్నమయ్యగారు శృంగార సంకీర్తనామృతంతో వీరిని అభిషేకించారు గదండీ!

  గోపాంగనల మెరుగు గుబ్బ చన్నులమీద

  చూపట్టు కమ్మ కస్తూరి పూత యితడు ...

  జలధికన్యాపాంగలనితేక్షణములలో

  కలసి వెలుగుచునున్న కజ్జలంబితడు ...

  జలజాసనుని వదన జలజ మధ్యము నుండి

  అలరు వెలువడిన పరమామృతం బితడు ...


వధువు 24.

ఫరవాలేదు లెండి. మా అమ్మ కూడా ప్రకృతి రూపాకృతి.

  ఈమె సౌందర్యాతిశయాన్ని అన్నమాచార్యులవారే సంకీర్తన

  రవళులలో బంధించివేశారు. అవధరించండి.

  ''ఇన్ని రాసుల యునికి యింతి చెలువపురాశి

  కన్నె నీరాశి కూటమి కలిగిన రాశి

  కలికి బొమ రిండ్లుగల కాంతకు ధనురాశి

  వెలయు మీనాక్షికిని మీనరాశి

  కులుకు కుంభముల కొమ్మకును కుంభరాశి

  చెలగి హరిమధ్యకును సింహరాశి''

  - మా అమ్మ సీతమ్మ వయోచిత అంగ సౌందర్యం రాసులు పోసినట్లు మీ

  అన్నమయ్యగారే మన కొండలయ్యగారికి నివేదించారు కదా అలివేలమ్మగా భావించి.


వరుడు 25.

నిజంగా మనం ఎంత ధన్యులం! ఇలా ఈ జగత్కల్యాణ సంధాయ కులైన  శ్రీ సీతారాముల కల్యాణానికి మధ్యవర్తులుగా కల్యాణగుణాభిరాముని

  కమనీయ వాచ్యాను సంధానం చేసుకున్నాము. సద్గురు త్యాగరాజస్వామి

  వారు కీర్తంచినట్లు - (సాధించెనే ఓ మనసా ... ఆరభిరాగం ... ఆదితాళం) పరమభక్తవత్సలుడు, సుగుణపారావారుండు, ఆజన్మ అనఘుడు, ఈ కలిబాధల తీర్చువాడు ...

  హరేరామచంద్ర రఘుకులేశ మృదుసుభాష

  శేషశయన పరనారీసోదరాజ విరాజ తు గరాజ

  రాజనుత విరామ యాపఘన సరసీరుహ దళాకక్షుడూ ...

  శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన

  కనకాంబర ధరలసన్మకుట కుండల విరాజితుడు ...


వధువు 26.

స్వామీ! ఎంత చక్కని సారూప్యం ఈ దివ్యవధూవరులది.

  చూచిన వారిదే కదా సౌభాగ్యం! ఆ రాముని దివ్యగుణజలధికి

  ఈ వాత్సలయ్య మహోదధి మన పూర్వజన్మ సుకృత విశేషం వలన

  పొందిక కుదిరింది. మనము వీరిని ఇలా చూస్తున్నందుకు ఒక్కటే

  కోరవలసినది - స్వామీ! మీ దివ్య దంపతుల సుందర

  ముఖారవింద వైభవాన్ని ఇలాగే మా గుండెలలో ఉండిపోనివ్వండి!

  ఇలాగే కల్యాణాలను సేవిస్తూ మా జీవితాలను పండిపోనివ్వండి!

  మీ సేవలో - మీ సంసేవనంలో మా జీవన వనాలను ఫలపుష్పభరితంగా ఎదగనీయండి!


 శ్లో|| చతుర్ముఖేశ్వర ముఖైః పుత్రపౌత్రాదిశాలినే |

  నమస్సీతా సమేతాయ రామాయ గృహమేధినే |

  మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే |

  చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్‌ ||

No comments:

Post a Comment