ప్రేమజీవి ప్రేమను పొందలేకపోయినా
చక్కగా చిక్కగా ప్రేమించగలదు.
కలసి జీవించ లేదేమో కాని
హాయిగా మరణించగలదు.
మదిలో లేకపోయినా
ఆ తీపి తలపులలో
సదా గుర్తుకు వస్తుంటుంది .
అసలు గుండెలు చెమ్మగిల్లడమే లేదేమిటి ?
వర్షం వచ్చినప్పుడు ఇంటి గోడలు తప్పితే!
చిటపట చినుకులా మొదలైన స్నేహం
వర్షంలా కురిసీ సెలయేరులా సాగి సాగి
నదిలా ప్రవహించి
ఎప్పటికి ఇంకిపోని సముద్రం వలె ఉండాలంటారు.
స్నేహం పువ్వులా వాడి పోనిది,
మంచులా కరిగిపోనిది,
ఆకులా రాలి పోనిది.
నీ నవ్వుతో జతకలిపి
తీయగా కూని రాగాలు తీస్తుంది.
నేను కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నానని
అంటోంది ఈ పాడు లోకం!
కళ్లు మూసుకుంటేనే గదా మంచి కల వస్తుంది
ఆ కలలోనే నా ప్రేయసి కనిపిస్తుందని
నేనెలా వివరించేది ఈ లోకానికి!
కురిసే ప్రతి వర్షపు బిందువు
స్వాతిముత్యము కాగలదా ?
విరిసే ప్రతి పువ్వు
పరిమళాన్ని విరజిమ్మగలదా ?
గలగలా ప్రవహించే ప్రతి వాగు
సెలయేరు కాదూకదా !
కనిపించే ప్రతి రాయీ
విగ్రహం కాలేదు మరి !
ఎదురుపడే ప్రతి మనిషీ
స్నేహితులు కాలేరు!
ప్రేమ నిజంగా ఎప్పుడు పుడుతుంది ?
మనసు దగ్గర ఐనప్పుడు కదా !
మనసు ఎప్పుడు దగ్గర అవుతుంది ?
మనిషికి మరో మనిషి దగ్గర ఐనప్పుడు.
అలా మనిషి కి ఇంకో మనిషి
ఎప్పుడు దగ్గర అవుతాడు ?
మనసు లో స్నేహం చిగురించాలేకాని
అదెంత పని ?....
జారిపోకు ఓ నీలి మేఘమా !
చిరుఝల్లు కురిసే వరకు
వాడిపోకు ఓ పుష్పమా
వేగిరం వసంతం వచ్చే వరకు
మరచిపోకు ఓ నా మిత్రమా
నాలో నీ ప్రాణమున్నంత వరకు.
తరతరాలుగా కుటుంబాని కంతటికీ
నానా చాకిరీచేసి అలసిపోతున్న
అమ్మని చూసి నుదుటిమీది కుంకుమబొట్టు
బొట్లు బొట్లుగా రోదిస్తోంది.
బాల్యంలో చిన్నప్పుడోసారి
నాన్నగారి కళ్ళద్దాలు పగలగొట్టేస్తే
ఆ పెద్ద మనిషి చెంపఛెళ్ళుమనిపించేవాడు
మరి యవ్వనంలో నేడు ఉద్యమంలో
ఎంచగ్గా బస్సుఅద్దాలు పగలగొట్టినా అడిగేవాడే లేడే...
నీ రాక కోసం గుడిలో నిరంతరం
నే నిరీక్షిస్తుంటే ఆ గుడిగోపురమెక్కి చూస్తోంది
నా మనస్సు నిక్కినిక్కి నీ కోసమై !
అయ్యగారికి ఈ మధ్య
మతిమరుపు మరీ ఎక్కువైనట్టుందే!
ఎదురుగా కనిపించిన వాళ్ళనే కాదు
తన్ను కని-పెంచిన వాళ్ళనికూడా
మరిచిపోతున్నాడేమిటి?
మరువకోయి కన్నవారినేనాడు మదిలోన !.....
ఓ ప్రేయసీ నువ్వు నాసమక్షంలో ఉన్నప్పుడు
దండెంమీద ఆరేసిన పట్టుపంచెలా
రెపెరెపలాడిపోతుంది నా మనస్సు!
కాని ఒక్కోసారి కాసేపు
నువ్వు నాకు కనిపించకపోతే గనక
చిలక్కొయ్యకి తగిలించిన చొక్కాలా
విలవిల్లాడిపోతోంది నా మనసు
దేనికో బదులు చేప్పవే ఓ మనసా !
ఆకలి తీరడానికి మొక్కజొన్న కంకుల్ని
అందరూ కాల్చుకు తింటారు.
గుండెల్ని కాల్చుకు తినేదొకటుందని
ప్రేమలో పడ్డాకే తెలిసింది
అది ప్రేయసి ఎడబాటని !
No comments:
Post a Comment